ఓజిలి మండలం కురుగొండ గ్రామంలో వైభవంగా ‘ఇంటింటి ప్రచారం’.
ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగిన ఎమ్మెల్యే పర్యటన!
సమస్యల పరిష్కారానికి అధికారులకు దిశానిర్దేశం చేస్తామని హామీ
ఓజిలి జూలై 27 (గరుడ ధాత్రి):
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజాబాట పట్టి వివరిస్తున్నట్లు సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ వెల్లడించారు. “2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమం విస్తృత ప్రచారంలో భాగంగా సోమవారం ఓజిలి మండలం కురుగొండ గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పర్యటించారు. ఈ పర్యటనకు గ్రామస్తుల నుంచి నీరాజనాలు లభించాయి.
అభివృద్ధిని వివరిస్తూ.. ఆప్యాయంగా పలకరిస్తూ:
గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లిన ఎమ్మెల్యే.. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి రోజువారీ ఇబ్బందులు, నియోజకవర్గంలో రావాల్సిన మార్పులపై ఆరా తీశారు. గత రెండేళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన అనేక విప్లవాత్మక మార్పులు, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ ఎలా చేరుతున్నాయో వివరించారు.
బాధితులకు కొండంత అండ – తక్షణ పరిష్కారానికి హామీ:
పర్యటనలో భాగంగా గ్రామస్తుల నుంచి పలు వినతులు, సమస్యలతో కూడిన వినతిపత్రాలను ఎమ్మెల్యే స్వీకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను సంబంధిత శాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లి, యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రముఖులు మరియు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.
