ePaper
Sunday, June 14, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కుళ్లిన మాంసం విక్రయాలపై సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి

కుళ్లిన మాంసం విక్రయాలపై సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి

📰 Generate e-Paper Clip

-ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న వారిని ఉపేక్షించరాదు.

-సిపిఎం నగర కార్యదర్శి కె. వేణుగోపాల్.

తిరుపతి నగరంలోని పి.పి. చావడి మటన్ మార్కెట్‌లో భారీ మొత్తంలో నిల్వ ఉంచిన కుళ్లిన మేక, గొర్రె తలలు, కాళ్లు మరియు ఇతర మాంసాహార పదార్థాలను ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని సిపిఎం నగర కార్యదర్శి కె. వేణుగోపాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు సందర్శించే ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. కొంతమంది వ్యాపారులు అధిక లాభాల కోసం ప్రజల ఆరోగ్యం, భక్తుల ప్రాణాలను పణంగా పెడుతూ కుళ్లిన మాంసాన్ని విక్రయించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆయన ఖండించారు.

ఆరోగ్య శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో కుళ్లిపోయిన దశలో దుర్వాసన వెదజల్లుతున్న మాంసం, పెద్ద మొత్తంలో నిల్వ ఉంచిన తలలు, కాళ్లు తదితర భాగాలను స్వాధీనం చేసుకోవడం పరిస్థితి ఎంత తీవ్రమైందో తెలియజేస్తోందన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి అసలు బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని కోరారు.

ఆహార భద్రత విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా నగరంలోని మాంసం మార్కెట్లు, హోటళ్లు, మెస్‌లు మరియు ఆహార విక్రయ కేంద్రాలపై మున్సిపల్, ఆరోగ్య శాఖ అధికారులు నిరంతర ప్రక్రియగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని అన్నారు. కుళ్లిన లేదా నాణ్యత లేని ఆహార పదార్థాలను విక్రయించే వారిపై కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా ట్రేడ్ లైసెన్సులను రద్దు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

గతంలో కూడా పీఎస్-4 రెస్టారెంట్‌లో ఆహారంలో బొద్దింకలు, నాణ్యత లేని ఆహార పదార్థాలు బయటపడిన సందర్భంలో సిపిఎం పోరాటాలు నిర్వహించిందని వేణుగోపాల్ గుర్తు చేశారు. అయితే అటువంటి ఘటనలపై కేవలం జరిమానాలు విధించడం లేదా తాత్కాలిక చర్యలతో సరిపెట్టడం వల్లే ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతమవుతున్నాయని విమర్శించారు. ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుని శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

తిరుపతి వంటి పుణ్యక్షేత్రంలో ఆహార భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని కె. వేణుగోపాల్ పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!