-తప్పిన పెను ప్రమాదం
గరుడధాత్రి : తిరుపతి జిల్లా తడ సమీపంలోని శ్రీసిటీ జీరో పాయింట్ వద్ద శనివారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శ్రీసిటీలోని ‘ఇండియా మెటల్ వన్ స్టీల్ ప్లేట్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థలో విధులు నిర్వహించే సిబ్బందిని తరలిస్తున్న ఎస్‌బిఎల్‌టి ప్రైవేట్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
ఉదయం సుమారు 07:50 గంటల సమయంలో జాతీయ రహదారి పక్కన బస్సు వెళ్తుండగా, ఇంజిన్ భాగం నుంచి ఒక్కసారిగా పొగలు రావడం గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై వాహనాన్ని నిలిపివేశారు. బస్సులో ఉన్న సిబ్బంది వెంటనే బయటకు దిగిపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కొద్ది నిమిషాల్లోనే మంటలు బస్సు మొత్తాన్ని ఆవహించడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది.
సమాచారం అందుకున్న వెంటనే తడ ఎస్సై కె. కొండప్పనాయుడు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల తీవ్రతను గమనించి సుళ్ళూరుపేట మరియు శ్రీసిటీ ఫైర్ స్టేషన్లకు సమాచారం అందించగా, అగ్నిమాపక యంత్రాలు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి.
ఈ ఘటనపై సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. మురళీ కృష్ణ మాట్లాడుతూ, “ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు మరియు శ్రీసిటీ సెక్యూరిటీ బృందాలు అక్కడ పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. ప్రాణనష్టం తప్పడం అదృష్టకరం. మంటలు చెలరేగడానికి గల ఖచ్చితమైన కారణాలపై విచారణ జరుపుతున్నాం, ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నాం” అని తెలిపారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వాహన యజమానులు, డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. మురళీ కృష్ణ కీలక సూచనలు చేశారు. వాహనాల ఇంజిన్, వైరింగ్‌లను నిపుణులైన మెకానిక్స్‌తో క్రమం తప్పకుండా తనిఖీ చేయించాలని, ప్రతి బస్సులోనూ కనీసం రెండు ఫైర్ ఎక్స్‌టింగ్యుషర్లను అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. అలాగే, వాహనంలో ఏదైనా అసాధారణ వాసన లేదా పొగను గమనించిన వెంటనే వాహనాన్ని నిలిపివేసి ప్రయాణికులను సురక్షితంగా దించివేయాలని ఆయన సూచించారు. ప్రయాణికుల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
