ePaper
Saturday, June 20, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిజలధార–జలహారతితో నీటి సంరక్షణకు కొత్త ఊపు

జలధార–జలహారతితో నీటి సంరక్షణకు కొత్త ఊపు

📰 Generate e-Paper Clip

జలధార–జలహారతితో నీటి సంరక్షణకు కొత్త ఊపు

గరుడధాత్రి న్యూస్ :

తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలో జలధార–జలహారతి కార్యక్రమం ద్వారా వర్షపు నీటిని సంరక్షిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి వనరులను అభివృద్ధి చేసే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రూ.1.57 కోట్ల అంచనా వ్యయంతో మండలంలో మొత్తం 68 నీటి సంరక్షణ పనులకు పరిపాలనా అనుమతులు జారీ అయ్యాయి. ఈ పనుల ద్వారా మండలంలోని వేలాది ఎకరాలకు సాగునీటి లబ్ధి కలగనుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా 26 ఫీడర్ కాలువల పునరుద్ధరణ, 20 ఫీల్డ్ కాలువల మరమ్మతులు, 6 చెక్‌డ్యాంల పూడికతీత, 5 చెరువుల పూడికతీత, 5 కందిత కందకాల నిర్మాణం, 6 నీటి కుంటల శుభ్రపరిచే పనులు చేపడుతున్నారు. ఈ పనుల ద్వారా సుమారు 3612 ఎకరాలకు సాగునీటి ప్రయోజనం చేకూరనుంది.
నాగలాపురం గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకం కింద 50 మంది కార్మికులతో రఘురెడ్డి పొలం నుంచి శెల్వం పొలం వరకు వెయ్యి మీటర్ల పొడవున పంట కాలువ పూడికతీత పనులు చేపడుతున్నారు. రూ.1.36 లక్షల అంచనా వ్యయంతో జరుగుతున్న ఈ పనుల ద్వారా పిచ్చాటూరు అరణ్యార్ ప్రాజెక్టు నుంచి ఎర్రచెరువు ద్వారా వచ్చే సాగునీరు నాగలాపురం, కొట్టాకాడు, వెంబాకం, బైటకొడింబీడు, నందనం ప్రాంత రైతులకు అందనుంది.
ఈ కాలువ పరిధిలో 423 ఎకరాలకు సాగునీటి లబ్ధితో పాటు 53 బోర్లు, 17 బావుల్లో భూగర్భ జలాలు పెరుగుతాయని అధికారులు తెలిపారు. వరి, వేరుశనగ, మామిడి వంటి పంటలకు సమృద్ధిగా నీరు అందడంతో రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
ఉపాధి హామీ వేతనదారుడు బాలాజీ మాట్లాడుతూ జలధార–జలహారతి పనుల ద్వారా రైతులకు సాగునీరు అందడమే కాకుండా గ్రామీణ కార్మికులకు ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయని తెలిపారు. రోజుకు రూ.307 వరకు వేతనం అందుతోందని, వేసవిలో వలసలు తగ్గి గ్రామాల్లోనే ఉపాధి లభిస్తోందని చెప్పారు.
వర్షపు నీటి ప్రతి చుక్కను భూమిలో నిల్వచేసే లక్ష్యంతో చేపడుతున్న ఈ పనులు భూగర్భ జలాల పెరుగుదలకు దోహదపడటంతో పాటు రైతు జీవితాల్లో కొత్త ఆశలు నింపుతున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!