దేశవ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో దీర్ఘకాలికంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కామ్రేడ్ వి వి ప్రసాద్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల 26 27 తేదీలలో చేపట్టనున్న సమ్మెకు సంఘీభావంగా శుక్రవారం తిరుపతిలో ఎస్బిఐ ఉద్యోగులు పాత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ఉన్న బ్యాంకు వద్ద ఫ్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్బిఐ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ తిరుపతి మాడ్యూల్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కామ్రేడ్ వి వి ప్రసాద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉందని గతంలో పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన పరిష్కరించిన దాఖలాలు లేవన్నారు. బ్యాంకు కార్యాచరణ సమగ్రత దీర్ఘకాలికంగా పరిష్కారం కాని సమస్యలు నేపథ్యంలో ఈనెల 26, 27 తేదీలలో దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టనున్నట్లు చెప్పారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యంతో డిమాండ్ల పరిష్కారం కోసం ఫెడరేషన్ నాయకులు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదు అన్నారు. బ్యాంకుల యొక్క భద్రత సేవా ప్రమాణాలను నిర్వహించడానికి ఖాళీగా ఉన్న మెసెంజర్లు, ఆర్ముడు గార్డులు, క్లరికల్ సిబ్బందిని నిర్మించాలని ఇప్పటికే పలుమార్లు అభ్యర్థించామన్నారు. అనంతరం ఎస్బిఐ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ తిరుపతి మాడ్యూల్ ఉపాధ్యక్షులు గిరిధర్ మాట్లాడుతూ ఉద్యోగుల పెన్షన్, ఎన్ పి ఎస్ సంస్కరణలు, పండు మేనేజర్లను మార్చుకునే అవకాశాన్ని ఉద్యోగులకు కల్పించాలన్నారు. 2019 నుండి నియమించబడిన ఉద్యోగుల వ్యక్తిగత సామాజిక ఇబ్బందులను తగ్గించడానికి ఇంటర్ సర్కిల్ బదిలీలను అమలు చేయాలన్నారు. కోర్ బ్యాంకింగ్ విధులను అవుట్సోర్సింగ్ చేయడానికి వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. థర్డ్ పార్టీ ఉత్పత్తుల బలవంతపు అమ్మకాలను ఆపాలన్నారు. ఎనిమిదవ స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ ను మంజూరు చేయాలని, మెడికల్ రీయంబర్స్మెంట్లను మరింత పెంచాలని విజ్ఞప్తి చేశారు. కెరీర్ ప్రోగ్రెషన్ స్కీమును పునరుద్ధరించాలని, బ్యాంకు బోర్డులో వర్క్ మెన్ ఎంప్లాయిస్ డైరెక్టర్ ను ట్రస్టీని నియమించాలన్నారు. దేశవ్యాప్తంగా ఉద్యోగుల హక్కులను ఖాతాదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సమ్మెకు వెళుతున్నట్లు చెప్పారు. సిబ్బంది కొరత సేవ నిబంధనల క్షీణత ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థకే ముప్పుగా మారిందన్నారు. ఇప్పటికైనా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగకుండా ఉండాలంటే యాజమాన్యం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని ఆల్ ఇండియా ఎస్బిఐ స్టాఫ్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగ యూనియన్ నాయకులు డి జి ఎస్ ప్రసాద్, ఏ జి ఎస్ రాజు, కోశాధికారి శ్రీకాంత్, తిరుపతిలోని పలు ఎస్బిఐ బ్యాంకు శాఖలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.
