వడదెబ్బకు ఒక్కరోజే 21 మంది మృతి
-విజయవాడలోనే 10 మంది.. వీరిలో ఎనిమిది మంది యాచకులు
గరుడధాత్రి : వడదెబ్బ ప్రభావంతో శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో 21 మంది మరణించారు. విజయవాడలోనే 10 మంది మృతిచెందారు. వడదెబ్బ వల్లే వీరిలో చాలామంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. వీరిలో రెండు మృతదేహాలు సాధారణ పౌరులవి కావడంతో వాటిని గుర్తించారు. మిగతా ఎనిమిది మంది గుర్తుతెలియని యాచకులని తెలిసింది. సీతారాంపురం చాపరాలవారి వీధిలో అపస్మారక స్థితిలో ఒక వ్యక్తి పడి ఉండగా స్థానికులు గుర్తించి ప్రభుత్వాసుపత్రికి తరలించగా చనిపోయాడు. అజిత్సింగ్్నగర్లోని న్యూరాజరాజేశ్వరీపేట రైల్వేగేటు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి(40) మృతిచెందాడు. రాఘవయ్య పార్కుకు సమీపంలో ఒక వ్యక్తి (50) చనిపోయాడు. హనుమాన్‌పేటలో జిల్లా జైలు సమీపంలో ఒకరు (65), బీసెంట్‌రోడ్డు ఎన్ఐసీ కార్యాలయం వద్ద మరొకరు (65) పడిపోయి ఉండగా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరూ శుక్రవారం చనిపోయారు. రథం సెంటరు, కాళేశ్వరరావు మార్కెట్టు, గాంధీ పార్కు సెంటరులో ముగ్గురు యాచకులు మరణించారు. కస్తూరిబాయిపేటకు చెందిన దావులూరి
రామారావు(57), గుణదల గాంధీబొమ్మ సెంటర్‌కు చెందిన నిమ్మగడ్డ శరత్‌బాబు(45) శుక్రవారం సాయంత్రం నిర్మలా కాన్వెంట్ జంక్షన్ వద్ద రోడ్డుపక్కన స్పృహ లేకుండా పడి ఉన్నారు. స్థానికులు 108కి ఫోన్ చేయగా వారు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
వడదెబ్బకు గురై ఏలూరు జిల్లాలో ముగ్గురు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు శుక్రవారం మృతిచెందారు. ఏలూరు జిల్లాలో పెదవేగి మండలం జగన్నాథపురానికి చెందిన రాచప్రోలు డేవిడ్ రాజు(64), ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన శేషమ్మ(40), చాట్రాయికి చెందిన సూరవరపు రాణి(65) వడదెబ్బకు గురై మృతిచెందారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం పూలపల్లిలో ఒడిశాలోని రాయగడ
జిల్లా రాయికోన ప్రాంతానికి చెందిన రాంపురి పింటు(28) వడదెబ్బతో మృతిచెందారు. కాకినాడ జిల్లాలో ముగ్గురు చనిపోయారు. సర్పవరం పంచాయతీలో ఒప్పంద కార్మికుడిగా పనిచేస్తున్న గుర్రం అప్పన్న(37), గొల్లప్రోలు మండలం చెందుర్తిలో పిల్లి రమణ(55), పిఠాపురంలో కె.అప్పారావు(40) వడదెబ్బతో మరణించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వడదెబ్బతో మృతిచెందారు. మార్కెట్ సెంటర్లో గుర్తుతెలియని వృద్ధుడు (60), పట్టణంలోని చిత్రాలయ సెంటర్లో విజేత సినిమాహాల్ ఎదుట యువకుడు (25-30) ఎండ తీవత్రతో మృతిచెందారు. వినుకొండ నియోజకవర్గం ఈపూరులో వెలినేని నరసింహారావు (69) వడదెబ్బతో మృతిచెందారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడలో అట్టా లక్ష్మి అనే మహిళ వడదెబ్బకు మృతిచెందారు.
