శ్రీసిటీని సందర్శించిన మహారాష్ట్ర విద్యార్థులు
– ‘ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్’ చొరవతో పారిశ్రామిక అభివృద్ధిపై అవగాహన
సత్యవేడు మే 21 గరుడధాత్రి న్యూస్:
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ చొరవతో ‘ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్’ యువసంఘం కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్రకు చెందిన వివిధ విద్యాసంస్థల నుంచి 50 మంది విద్యార్థులు, అధ్యాపకులు గురువారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ వేగవంతమైన పారిశ్రామిక అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష అవగాహన కల్పించడం లక్ష్యంగా మహారాష్ట్రలోని 29 జిల్లాల నుంచి పర్యటనకు విచ్చేసిన విద్యార్థులకు శ్రీసిటీ వైస్ ప్రెసిడెంట్ (కస్టమర్ రిలేషన్స్) రమేష్ కుమార్ సాదర స్వాగతం పలికి, శ్రీసిటీ పారిశ్రామిక ప్రగతి, ప్రత్యేకతలను వివరించారు.
అనంతరం విద్యార్థులతో ముఖాముఖి చర్చల్లో పాల్గొన్న శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, దేశ సమైక్యతను చాటిచెబుతూ దేశంలోని విభిన్న ప్రాంతాలు, సంస్కృతులు, సాంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేసే ఈ మంచి కార్యక్రమానికి శ్రీసిటీని ఎంపిక చేయడం తాము గౌరవప్రదంగా భావిస్తున్నాం అన్నారు. వెనుకబడిన ప్రాంతం నుంచి అద్భుత ఆర్థిక కేంద్రంగా శ్రీసిటీ పరిణామం చెందిన తీరును వివరిస్తూ, ప్రస్తుతం 31 దేశాలకు చెందిన 250కిపైగా సంస్థలకు నిలయంగా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, FMCG, ఇంజినీరింగ్, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో విశేష అభివృద్ధి సాధించిందని తెలిపారు. పలు ఏసీ కంపెనీల ఏర్పాటుతో ఇండియా ‘కూల్ క్యాపిటల్’ గా మారిందన్నారు. 80 వేల కోట్ల పెట్టుబడులు, 60 వేల కోట్లకు పైగా ఎగుమతుల సామర్ధ్యంతో “మేక్ ఇన్ ఇండియా ఫర్ ది వరల్డ్” లక్ష్యానికి అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేస్తూ 75 వేల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాయని, అందులో దాదాపు సగం మంది మహిళలేనని తెలిపారు. ‘యువసంఘం’ కార్యక్రమంపై స్పందిస్తూ యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనపై శ్రీసిటీ ప్రత్యేక దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు.
ముఖాముఖిలో ఎంతో ఆసక్తితో శ్రీసిటీ సామాజిక వసతులు, పారిశ్రామిక అనుకూల వాతావరణం, సుస్థిరత, ఉపాధి అవకాశాలు తదితర పలు అంశాలను తెలుసుకున్న విద్యార్థులు, అనంతరం శ్రీసిటీ పరిసరాలను తిలకించారు. ప్రపంచ శ్రేణి సదుపాయాలు, పేరుగాంచిన పరిశ్రమలు, చక్కని వాతావరణం తమనెంతగానో ఆకట్టుకుందని ఈ సందర్భంగా విద్యార్థులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమ అధ్యయనానికి, భవిష్యత్ ప్రణాళికలకు ఈ పర్యటన ఎంతో ఉపయోగకరమన్న వారు, తమకు ఆతిధ్యమిచ్చిన శ్రీసిటీ యాజమాన్యానికి కృతఙ్ఞతలు తెలిపారు.
కాగా, “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” అనేది భారత ప్రభుత్వంచే ప్రారంభించబడిన వినూత్న పథకం. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న సాంస్కృతిక సంబంధాల ద్వారా ఐక్యతను పెంపొందించడం, వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడం ఈ పథకం లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుపతి ఐఐటీ ని ఈ కార్యక్రమానికి నోడెల్ ఇన్స్టిట్యూట్ గా గుర్తించారు.
