– అల్పాహారం ఒకరు.. మధ్యాహ్న భోజనం మరొకరు..!
సత్యవేడు, జూన్ 3 గరుడధాత్రి :
నియోజకవర్గ కేంద్రమైన సత్యవేడులో ప్రారంభమైన అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం ఆసక్తికర పరిణామాలకు వేదికగా నిలిచింది.
ప్రోటోకాల్ ప్రకారం సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించి, ఉదయం అల్పాహార పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం అధికారులు తమ కార్యాలయాలకు వెళ్లిపోయారు.
అయితే కొద్దిసేపటికే టీడీపీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి అన్నా క్యాంటీన్‌కు వస్తున్నట్లు అధికారులకు సమాచారం అందడంతో వారు మళ్లీ క్యాంటీన్ వద్దకు చేరుకున్నారు. అనంతరం క్యాంటీన్లోని మరో ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన రిబ్బన్‌ను శంకర్ రెడ్డి కత్తిరించి ప్రారంభించారు.
గంట వ్యవధిలోనే రెండు వేర్వేరు ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరగడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే చేతుల మీదుగా అల్పాహార సేవలను ప్రారంభించగా, శంకర్ రెడ్డి చేతుల మీదుగా మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఒకే అన్నా క్యాంటీన్‌కు గంట వ్యవధిలో ఇద్దరు నాయకులు ప్రారంభోత్సవం నిర్వహించడం సత్యవేడులో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
