ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్సత్యవేడు టీడీపీలో రాజుకుంటున్న అంతర్గత విభేదాలు

సత్యవేడు టీడీపీలో రాజుకుంటున్న అంతర్గత విభేదాలు

📰 Generate e-Paper Clip

రెండేళ్ల అభివృద్ధి ప్రచారంలో వర్గ విభేదాల ప్రభావం?

ఒకే గూటికి చేరతామన్న నేతల మధ్య ఆధిపత్య పోరు

సత్యవేడు, ఆగస్టు 4 గరుడధాత్రి :

సత్యవేడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “రెండేళ్ల అభివృద్ధి – సంక్షేమం” కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి కరపత్రాల పంపిణీ చేపట్టాలని పార్టీ అధిష్ఠానం సూచించినప్పటికీ, స్థానికంగా నాయకుల మధ్య సమన్వయం లోపించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పార్టీని ఏకతాటిపైకి తీసుకువస్తానని చెప్పిన నియోజకవర్గ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి నాయకత్వంపై కొంతమంది కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొన్నట్లు సమాచారం. సత్యవేడు పట్టణంలో కార్యక్రమాల నిర్వహణలో నాయకులు వేర్వేరుగా వ్యవహరిస్తున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది.

కొంతమంది నాయకులకు ప్రాధాన్యత లభిస్తోందని, సీనియర్ కార్యకర్తలకు తగిన గుర్తింపు దక్కడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

-స్థానిక ఎన్నికల ముందు సవాల్

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీలో సమన్వయం కీలకమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. నాయకుల మధ్య విభేదాలు కొనసాగితే పార్టీ బలోపేతంపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

టీడీపీ క్రమశిక్షణకు పేరుగాంచిన పార్టీ అని, కార్యకర్తలు అంతా ఒకే దిశగా పనిచేస్తేనే పార్టీ మరింత బలపడుతుందని పలువురు నేతలు సూచిస్తున్నారు.

-మరో వర్గం ఎమ్మెల్యే ఆదిమూలం వైపు

ఇదిలా ఉండగా, పార్టీ అంతర్గత పరిణామాల నేపథ్యంలో కొంతమంది కార్యకర్తలు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వర్గం వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ కార్యక్రమాలను ఆయన అనుచరులు ముందుకు తీసుకెళ్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

-సమన్వయమే మార్గమంటున్న కార్యకర్తలు

నాయకుల మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలను పక్కనపెట్టి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలు కోరుతున్నారు. పార్టీ కార్యక్రమాలు విజయవంతం కావాలంటే నాయకత్వం, క్యాడర్ మధ్య సమన్వయం అవసరమని అభిప్రాయపడుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!