ఆగష్టు 22 నుంచి 29వరకు రాతపరీక్షలు
ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి శివశంకర్ లోతేటి వెల్లడి
తిరుపతి, జులై 19 గరుడధాత్రి : రాష్ట్రంలో ఎపిట్రాన్స్కో, ఎపిజెన్కో, ఎపిఎస్పిడిసిఎల్, ఎపిఇపిడిసిఎల్, ఎపిసిపిడిసిఎల్ సంస్థల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల నియామకాలకై అభ్యర్థులు ఈనెల 20వతేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎపిఎస్పిడిసిఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎపిట్రాన్స్కోలో ఎలక్ట్రికల్ ఇంజనీర్లు 16, టెలికామ్ 10, సివిల్ ఇంజనీర్లు 23 మొత్తం కలిపి 200, ఎపిజెన్కోలో ఎలక్ట్రికల్ ఇంజనీర్లు 52, మెకానికల్ 21, ఎలక్ట్రానిక్స్ 7, సివిల్ ఇంజనీర్లు 20 మొత్తం కలిపి 100, ఎపిఎస్పిడిసిఎల్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్లు 125, టెలికామ్ 4, సివిల్ ఇంజనీర్లు 6 మొత్తం కలిపి 135, ఎపిఇపిడిసిఎల్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్లు 128, టెలికామ్ 3, సివిల్ ఇంజనీర్లు 4 మొత్తం కలిపి 135, ఎపిసిపిడిసిఎల్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్లు 56, టెలికామ్ 1, సివిల్ ఇంజనీర్లు 3 మొత్తం కలిపి 60 పోస్టుల నియామకానికి ఆయా సంస్థలు ప్రకటనను జారీ చేయడం జరిగిందన్నారు. నియామక ప్రకటనలో పేర్కొన్న షెడ్యూల్ మేరకే ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోందని, ఈ నెల 20వతేదీ సాయంత్రంలోగా అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. షెడ్యూల్ పేర్కొన్న విధంగానే ఈ యేడాది ఆగష్టు 22వతేదీ నుంచి 29వతేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని, ఈ షెడ్యూల్ తేదీల్లో ఎటువంటి మార్పు వుండబోదని స్పష్టం చేశారు. ఏఇఇ పోస్టుల నియామక ప్రక్రియ మొత్తాన్ని పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఈ ప్రక్రియకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఎఇఇ పోస్టుల నియామక అంశంలో అభ్యర్థులు దళారుల మాటలు, ఇతర అనధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా వెలువడే సమాచారాన్ని నమ్మి మోసపోవద్దని సూచించారు.
