గరుడదాత్రి న్యూస్ బ్రహ్మంగారిమఠం జులై 22:
రేకలకుంట పంచాయతీ పరిధిలోని గ్రామాల అభివృద్ధికి కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను వినియోగిస్తూ రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ముందుకు వస్తోంది. ఇందులో భాగంగా జెడ్. కొత్తపల్లె గ్రామంలో క్రీడా మైదానం నిర్మాణంతో పాటు ప్రధాన రహదారి నుంచి గ్రామంలోని అంతర్గత వీధి వరకు రోడ్డు కనెక్టివిటీ పనులను ఈరోజు ఘనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కడప జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కానాల మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులు సమర్థవంతంగా వినియోగించడం అభినందనీయమని అన్నారు. గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యాజమాన్యం గ్రామాల అభివృద్ధికి సహకరించడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. రేకలకుంట పంచాయతీలోని ఇతర గ్రామాల్లో కూడా అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టాలని గ్రామస్తులు కోరారు.
ఈ కార్యక్రమంలో రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం, రేకలకుంట పంచాయతీ పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెరుగు వీరయ్య, గుజ్జు రామాంజనేయులు, పుటాలశివాయాదవ్, పెరుగు నాగేంద్ర,గ్రామ పెద్దలు, పాల్గొన్నారు.
