ePaper
Thursday, October 1, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిమేడలు, మిద్దెలు వద్దు.. ఆకలి బాధలు తీర్చండి!

మేడలు, మిద్దెలు వద్దు.. ఆకలి బాధలు తీర్చండి!

📰 Generate e-Paper Clip

*పలమనేరు, సెప్టెంబర్ 28 ( గరుడ ధాత్రి ) :
గ్రామాల్లో చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గిరిధర్ గుప్తా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీఆర్ఏల న్యాయమైన కోర్కెలు నెరవేర్చాలని కోరుతూ సోమవారం పలమనేరు ఆర్డీవో కార్యాలయం వద్ద వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిధర్ గుప్తా మాట్లాడుతూ… గత రెండేళ్లుగా వీఆర్ఏల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, సమస్యలు పరిష్కరించమంటే మొద్దు నిద్ర నటిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డుల భద్రత పేరుతో నిబంధనలకు విరుద్ధంగా వీఆర్ఏలకు నైట్ డ్యూటీలు వేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. జిల్లా వ్యాప్తంగా అటెండర్, వీఆర్వో, వాచ్‌మెన్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ, అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వకుండా పాలకులు మోసం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏలకు గత మూడేళ్లుగా పే స్కేల్ అమలు చేస్తున్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని పిలుపునిస్తుంటే, మరోవైపు ఉన్న బిడ్డలనే పోషించుకోలేక వీఆర్ఏలు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని జీతాలతో వీఆర్ఏల కుటుంబాలు ఎలా గడుస్తాయో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల లోపు సమస్యలు పరిష్కరించకపోతే, ఎన్నికల విధులను బహిష్కరిస్తామని ఆయన హెచ్చరించారు. గ్రామ రెవెన్యూ సంఘం నాయకులు ప్రకాష్, దేవేంద్రలు మాట్లాడుతూ… నిత్యవసర వస్తువులతో పాటు కరెంటు, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడంతో వీఆర్ఏల కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి అర్హులకు ప్రమోషన్లు ఇవ్వకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. వన్ టైం సెటిల్మెంట్ ద్వారా అర్హులైన వీఆర్ఏలకు వెంటనే ప్రమోషన్లు కల్పించాలన్నారు. నామినీలను వీఆర్ఏలుగా గుర్తించాలి (దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అదనపు ఆర్థిక భారం పడదు). నిబంధనలకు విరుద్ధంగా విధించిన నైట్ డ్యూటీలను తక్షణమే రద్దు చేయాలన్నారు. ప్రభుత్వం తమ సమస్యలపై సానుకూలంగా స్పందించకపోతే జిల్లా వ్యాప్తంగా వీఆర్ఏలు సమ్మెకు దిగుతామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలమనేరు మండల కార్యదర్శి దేవేంద్ర, గంగావరం కార్యదర్శి ప్రకాష్, వీకోట కార్యదర్శి ఆనంద్, పెద్దపంజాణి కార్యదర్శి వెంకటరమణ, బైరెడ్డిపల్లి కార్యదర్శి సుబ్రహ్మణ్యం తదితర నాయకులతో పాటు వీఆర్ఏలు పిచ్చయ్య, శంకర, శాంతమ్మ, అమర, సుజాత, బోయకొండ, గురు మరియు వివిధ మండలాల వీఆర్ఏలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!