ePaper
Saturday, June 20, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఆర్టీసీ ప్రైవేటీకరణ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలి

ఆర్టీసీ ప్రైవేటీకరణ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలి

📰 Generate e-Paper Clip

ఆర్టీసీ ప్రైవేటీకరణ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలి
-సూళ్లూరుపేటలో ఏఐటీయూసీ నిరసన
గరుడధాత్రి :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) ప్రైవేటీకరణ ప్రతిపాదనను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఆర్టీసీ డిపో ఎదుట శుక్రవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శి ఇలప నాగేంద్రబాబు మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం కోసం ఏర్పాటైన ఏపీఎస్‌ఆర్టీసీని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ కారణంగా టికెట్ ధరలు పెరిగే ప్రమాదంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో బస్సు సౌకర్యాలు నిలిచిపోయే అవకాశం ఉందన్నారు.
లాభదాయకం కాని రూట్లలో ప్రైవేట్ సంస్థలు బస్సులు నడపవని, దీంతో గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. అలాగే 50 వేల మందికి పైగా ఉద్యోగులు, కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడుతుందని, వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు.
ప్రజల సొమ్ముతో నిర్మించుకున్న డిపోలు, బస్సులు, ఆస్తులను కార్పొరేట్ శక్తులకు అప్పగించడం అన్యాయమని అన్నారు. ఏపీఎస్‌ఆర్టీసీ లాభాల్లో నడుస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటని, నష్టాల పేరుతో ప్రైవేటీకరణ చేపట్టడం సరికాదని విమర్శించారు.
నష్టాలు ఉంటే వాటిని సరిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలే తప్ప సంస్థను అమ్మేయడం పరిష్కారం కాదన్నారు. ఆర్టీసీని బలోపేతం చేసేందుకు ఆర్థిక సాయం ప్రకటించి, కార్మిక సంఘాలతో చర్చించి ఉద్యోగుల భద్రతకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజా రవాణా ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని గుర్తుచేస్తూ, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్షులు శ్రీనివాసులు, నాయకులు రమణయ్య, బాలు, చెంచమ్మ, కోటయ్య, కనకమ్మ, నందకుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!