-జూన్ 9న రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు
గరుడధాత్రి న్యూస్ :
ఈరోజు సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో వామపక్ష పార్టీల కీలక సమావేశం జరిగింది. సమావేశానికి సిపిఐ(ఎం.ఎల్) రాష్ట్ర నాయకులు జాస్తి కిషోర్ బాబు అధ్యక్షత వహించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా నాలుగు సార్లు పెంచడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది. మరోసారి ధరలు పెంచబోతున్నారనే వార్తలపై ఆందోళన వ్యక్తం చేసింది.
ఇంధన ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జూన్ 1 నుంచి 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. కరపత్రాల పంపిణీ, సమావేశాలు, సదస్సుల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు.
అలాగే ఈ ప్రచార కార్యక్రమాల అనంతరం జూన్ 9న రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను నిరసించాలని సమావేశం తీర్మానించింది.
కేజీ బేసిన్ గ్యాస్ సాధన కోసం పాసర్లపూడి ప్రాంతాన్ని వామపక్ష పార్టీల బృందం జూన్ మొదటి వారంలో సందర్శించనుంది.
సమావేశంలో ప్రధాన డిమాండ్లు:
పెట్రోలు, డీజిల్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించాలి
కేజీ బేసిన్ నుంచి ఉత్పత్తి అయ్యే చమురు, గ్యాస్‌లో 50 శాతం రాష్ట్రానికి కేటాయించాలి
రష్యా, ఇరాన్ దేశాల నుంచి ఆయిల్, గ్యాస్ కొనుగోళ్లు కొనసాగించాలి
కమర్షియల్ గ్యాస్‌ను పాత ధరలకే అందించాలి:
ఈ సమావేశంలో వి.శ్రీనివాసరావు, వై.వెంకటేశ్వరరావు (సిపిఎం), హరినాథ్ రెడ్డి (సిపిఐ), చిట్టిపాటి వెంకటేశ్వర్లు, పొలారి (సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ), హరినాథ్ (సిపిఎంఎల్ లిబరేషన్), గణేష్ బాబు (ఎంసిపిఐ-యు) పాల్గొన్నారు.
ఆర్‌ఎస్‌పి, ఫార్వర్డ్ బ్లాక్, న్యూ డెమోక్రసీ, ఎస్‌యుసిఐ(సి) పార్టీలు సమావేశ నిర్ణయాలకు తమ పూర్తి మద్దతు ప్రకటించాయి.
