ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతితిరుమలలో జనతా క్యాంటీన్ల ధరల దోపిడీ..! టీటీడీ లక్ష్యానికి విరుద్ధంగా భక్తులపై అదనపు భారం

తిరుమలలో జనతా క్యాంటీన్ల ధరల దోపిడీ..! టీటీడీ లక్ష్యానికి విరుద్ధంగా భక్తులపై అదనపు భారం

📰 Generate e-Paper Clip

తిరుమలలో సామాన్య భక్తులకు తక్కువ ధరలకు నాణ్యమైన ఆహారం అందించాలన్న టీటీడీ లక్ష్యం జనతా క్యాంటీన్ల వద్ద నీరుగారుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తక్కువ అద్దెకు స్థలాలు కేటాయించినప్పటికీ, కొన్ని జనతా క్యాంటీన్ల నిర్వాహకులు పెద్ద క్యాంటీన్లు, ఏపీ టూరిజం హోటళ్ల కంటే అధిక ధరలు వసూలు చేస్తూ భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
తిరుమలకు వచ్చే లక్షలాది భక్తులకు టీటీడీ ఉచిత అన్నప్రసాదాన్ని అందిస్తున్నప్పటికీ, తమ అభిరుచికి అనుగుణంగా ఇతర ఆహార పదార్థాలను కొనుగోలు చేసే భక్తులు జనతా క్యాంటీన్లను ఆశ్రయిస్తుంటారు. అయితే అక్కడ వసూలు చేస్తున్న ధరలు వారిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
ఎస్‌ఎంసీ ప్రాంతంలోని ఓ జనతా క్యాంటీన్‌లో రెండు ఇడ్లీలు రూ.40, రెండు వడలు రూ.70, సాధారణ దోశ రూ.60 నుంచి రూ.110, పన్నీర్ దోశ రూ.110, సౌత్ ఇండియన్ భోజనం రూ.220, పిల్లల భోజనం రూ.160, వెజ్ బిర్యానీ రూ.200, పెరుగన్నం రూ.95గా విక్రయిస్తున్నారు. అదనంగా స్టార్టర్స్ రూ.150 నుంచి రూ.250 వరకు, మిల్క్ షేక్స్ రూ.100కు పైగా విక్రయిస్తున్నారు. వీటిపై పన్నులు అదనంగా వసూలు చేస్తున్నారు.
ఇదే సమయంలో, శ్రీఅన్నమయ్య భవనంలోని ఏపీ టూరిజం హోటల్ నెలకు సుమారు రూ.5 లక్షల అద్దె చెల్లిస్తూ, రెండు ఇడ్లీలు రూ.25, వడ రూ.40, దోశలు రూ.50 నుంచి రూ.120, సౌత్ ఇండియన్ భోజనం రూ.150, పిల్లల భోజనం రూ.95, వెజ్ బిర్యానీ రూ.150కు అందిస్తోంది. అధిక అద్దె చెల్లించే హోటల్‌లో ధరలు తక్కువగా ఉండగా, తక్కువ అద్దెతో నడుస్తున్న జనతా క్యాంటీన్లలో అధిక ధరలు వసూలు చేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ ధర్మకర్తల మండలి సదుద్దేశంతో బిగ్, జనతా క్యాంటీన్ల అద్దెలను తగ్గించి, నాణ్యమైన ఆహారాన్ని తక్కువ ధరలకు అందించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఐదు జనతా క్యాంటీన్లకు అనుమతులు మంజూరు చేసి, నెలకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల లోపు అద్దెను ఖరారు చేసింది.
ఈ విషయంపై టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు స్పందిస్తూ, జనతా క్యాంటీన్లలో ధరల పట్టికను ఇంకా అధికారికంగా ఖరారు చేయలేదని తెలిపారు. తిరుపతిలోని ఇండియన్ కలినరీ అకాడమీ ద్వారా ధరలపై అధ్యయనం చేయించి, తగిన ధరలను నిర్ణయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే ధరలను ఖరారు చేసి అమలు చేస్తామని చెప్పారు.
అంతవరకు నిబంధనల ప్రకారం హోటళ్లు నిర్వహించాలని, ధరలను తగ్గించాలని క్యాంటీన్ యజమానులకు సూచించినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ స్పష్టం చేసింది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!