పలమనేరు జులై 21 (గరుడ ధాత్రి ) :
పట్టణంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్థిరపడాలని పలమనేరు మునిసిపల్ కమీషనర్ కె.ఎల్. వర్మ పిలుపునిచ్చారు. మంగళవారం మునిసిపల్ కార్యాలయంలో మెప్మా సిబ్బంది, రిసోర్స్ పర్సన్లు (ఆర్పీలు) తో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ… ప్రతి ఇంట్లోనూ ఒక వ్యాపారవేత్తను తయారు చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని తెలిపారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పిస్తోందని, సంఘ సభ్యులు తీసుకున్న రుణాలను వ్యాపారాభివృద్ధికి వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలని కోరారు. పలమనేరు పట్టణంలో సుమారు 10,000 మంది సంఘాల సభ్యులు ఉన్నారని, వారందరూ తమ ఇంటి ప్రాంగణాల్లో అనువైన మొక్కలు, చెట్లతో పాటు టెర్రేస్ గార్డెన్, కిచెన్ గార్డెన్‌లను పెంచుకోవాలని సూచించారు. చెత్తను మురికి కాలువలలో వేయకుండా, తడి చెత్త మరియు పొడి చెత్తను వేర్వేరుగా చేసి మునిసిపల్ కార్మికులకు అందించాలన్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి హాని కలగడమే కాకుండా అనేక రోగాలు వస్తాయని, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెప్మా సిఎంఎం బాబా, సిఓలు హరిప్రియ, కృష్ణకుమారి, జగదీష్, రామచంద్రతో పాటు సమాఖ్య పదాధికారులు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.
