ePaper
Saturday, June 20, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివిద్యుత్ ప్రమాదాలకు దూరంగా ఉండండి -ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి శివశంకర్ లోతేటి సూచన

విద్యుత్ ప్రమాదాలకు దూరంగా ఉండండి -ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి శివశంకర్ లోతేటి సూచన

📰 Generate e-Paper Clip

తిరుపతి, మే 28 గరుడధాత్రి : బలమైన గాలి, వర్షం కురిసే సందర్భాల్లో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా వినియోగదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి గురువారం ఒక ప్రకటనలో కోరారు. బలమైన గాలి, వర్షం కారణంగా సంస్థ పరిధిలో అక్కడక్కడా విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, విద్యుత్తు లైన్లు తెగిపోవడం లాంటి సంఘటనలు జరిగాయన్నారు. ఇటువంటి సంఘటనలు జరిగిన సందర్భాల్లో వినియోగదారులు తెగిపడిన విద్యుత్ తీగలను తాకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బలమైన గాలి, వర్షం కురిసే సందర్భాల్లో వినియోగదారులు విద్యుత్ తీగల కింద, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లకు దగ్గరగా నిలబడవద్దని సూచించారు. తమ ప్రాంతంలో ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, లైన్లు తెగిపోవడం లాంటి సంఘటనలను గుర్తించినట్లయితే వినియోగదారులు వెంటనే సమీపంలోని విద్యుత్ శాఖ అధికారులకు గానీ లేదా సిబ్బందికి గానీ సమాచారాన్ని అందించాలని సూచించారు. అదేవిధంగా విద్యుత్ బిల్లుపై ముద్రించబడిన తమ ప్రాంత అసిస్టెంట్ ఇంజనీర్ మొబైల్ నంబరుకు గానీ లేదా విద్యుత్ శాఖ టోల్-ఫ్రీ నంబర్లు: 1912 లేదా 1800 425 155333కు కాల్ చేసి సమాచారాన్ని తెలియజేయవచ్చని సూచించారు.

-విద్యుత్తు తీగ తెగిపడడంతో మహిళ, గేదెలు మృతి బాధాకరం

ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని నెల్లూరు జిల్లా, ఉదయగిరి నియోజకవర్గం, సీతారామపురం సెక్షన్ పరిధిలో బలమైన గాలి, వర్షం కారణంగా ఈనెల 27వ తేదీన రెండు వేర్వేరు ప్రాంతాల్లో విద్యుత్తు తీగలు తెగిపడడంతో ఒక మహిళ, గేదెలు మృతిచెందిన సంఘటన బాధాకరమని ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. ఈనెల 27వ తేదీన తెల్లవారుజామున తెగిపడిన విద్యుత్ తీగను తాకిన కారణంగా బసినేపల్లి పంచాయతీ, కొయ్యలపాడు గ్రామానికి చెందిన చలసాని వెంకటసుబ్బమ్మ (56) మృతి చెందారని, అదే మండలంలోని గంగవరం గ్రామంలో అదే రోజు మధ్యాహ్నం కొంతమంది రైతులకు చెందిన పశువులు పొలంలో మేస్తున్న సందర్భంలో విద్యుత్తు తీగ తెగి గేదెలపై‌ పడడంతో గేదెలు మృతి చెందాయని తెలిపారు. విద్యుత్ శాఖ నిబంధనల మేరకు బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందజేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!