రాష్ట్రస్థాయిలో 2025 లో స్వచ్ఛ కుప్పం అవార్డు కైవసం.
మరోసారి 2026 లో ఆపరేషన్ క్లీన్ స్వీప్ అవార్డ్.
ఇక జాతీయస్థాయి అవార్డు కోసం కసరత్తు.
పురపాలక సంఘం కమిషనర్ శ్రీనివాసరావు అపార చొరవ.
కుప్పంలో ప్రతిరోజు అర్ధరాత్రి నుంచే పారిశుద్ధం పనులు.
పారిశుద్ధ పనులు, ప్రజా చైతన్య కార్యక్రమాల్లో కమిషనర్ శ్రీనివాసరావు బిజీ బిజీ.
అవార్డు గ్రహీత కమిషనర్ కు నేడు అభినందన సన్మానం.
కుప్పం,జులై 19 (గరుడ ధాత్రి న్యూస్):
చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గ పరిధిలోని కుప్పం పురపాలక సంఘం అవార్డులను దక్కించుకునే క్రమంలో దూసుకుపోతోంది. ఇందుకు పురపాలక సంఘం కమిషనర్ వి. శ్రీనివాస రావు వ్యూహాత్మక కృషి, పట్టుదల కారణమవుతోంది. కృషితో నాస్తి దుర్భిక్షం సూత్రం ఆధారంగా పరిపాలన పై తనకున్న అపార అనుభవం అందరి మన్ననలకు కారణమవుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ నియోజకవర్గానికి ప్రాధాన్యత సంతరించుకుంది. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ ల సహకారంతో కుప్పం పురపాలక సంఘం కమిషనర్ శ్రీనివాసరావు కుప్పంను ‘స్వచ్ఛ కుప్పం – స్వర్ణ కుప్పం’ గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కమిషనర్ తీసుకుంటున్న చర్యలు విజయవంతం అవుతున్నాయి. పచ్చదనం పరిశుభ్రత పై కుప్పం పురపాలక సంఘం పరిధిలోని ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు నిరంతరం సమయం వెచ్చిస్తున్నారు. వీలు దొరికినప్పుడల్లా కమిషనర్ ఇంటింటా తిరుగుతూ పారిశుద్ధం పై ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. నిర్ణీత తేదీలలో వార్డులలో మకాం వేసి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వార్డులలో పారిశుద్ధ్య పనులు చేపడుతూ, ఏళ్ల నాటి పూరుకు పోయిన మురుగునీటి కాలువలను శుభ్రం చేయిస్తున్నారు. దోమల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. మరో ప్రక్కన ప్రజలను చైతన్య పరుస్తున్నారు. దీంతో పచ్చదనం పరిశుభ్రతకు పురపాలక సంఘం పరిధిలోని ప్రజలు అధికారులకు తోడ్పాటు అందిస్తున్నారు. ఇళ్లలోని చెత్తాచెదారాలను పురపాలక సంఘం చెత్త సేకరణ వాహనాల్లో ఇస్తున్నారు. పురపాలక సంఘం తరపున ముఖ్యమైన ప్రదేశాలలో పచ్చదనాన్ని పరుస్తున్నారు. పచ్చదనాన్ని కాపాడుకునేందుకు పురపాలక సంఘం తరఫున మొక్కలకు నీరు పోసే కార్యక్రమాన్ని సైతం కొనసాగిస్తున్నారు. పురపాలక సంఘం పరిధిలోని కౌన్సిలర్లు సైతం అధికారులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. దీంతో అన్ని కార్యక్రమాలు ఉత్సాహవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో మున్సిపల్ కమిషనర్ కృషి కి తగ్గ ఫలితం కూడా లభిస్తోంది. 2025లో రాష్ట్రస్థాయిలో కుప్పం పురపాలక సంఘం పచ్చదనం పరిశుభ్రత పై మొదటి స్థానాన్ని దక్కించుకుంది. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతులు మీదుగా కమిషనర్ శ్రీనివాసరావు అవార్డు అందుకున్నారు. మరో ప్రక్కన ఇటీవల నెల రోజులపాటు పురపాలక సంఘం పరిధిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు కుప్పం పురపాలక సంఘం పరిధిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టారు. దీంతో మరో సారి ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించింది.18 వ తేదీ(2026)న విజయవాడలో జరిగిన కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాసరావు మళ్లీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. దీంతో రెట్టింపు ఉత్సాహంతో పురపాలక సంఘం అధికారులు, పారిశుద్ధ కార్మికులు, సిబ్బంది,కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జాతీయ స్థాయి అవార్డు దక్కించుకునేందుకు కృషి కొనసాగిస్తున్నారు. వృత్తి పరంగా కమిషనర్ తన విధులను తాను నిర్వహిస్తూ, పచ్చదనం పరిశుభ్రత, ప్రజా ఆరోగ్య పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ ప్రజా చైతన్యంతో విజయపరంపర కొనసాగిస్తూ ఉండడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతున్నది. దీంతో నేడు సోమవారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ను ఘనంగా అభినందించి, సన్మానించనున్నారు.
