పలమనేరు, జులై 20 ( గరుడ ధాత్రి ) :
పలమనేరు పరిధిలో వరుస ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగని పలమనేరు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బైరెడ్డిపల్లి మండలం, బడికాయలపల్లి గ్రామానికి చెందిన గంగిద్దుల వరదరాజు (46) అనే నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు, పలమనేరు ఎస్‌డీపీఓ డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో పలమనేరు ఇన్‌స్పెక్టర్ మోహన్ రెడ్డి, సబ్ ఇన్‌స్పెక్టర్ లోకేష్ రెడ్డి మరియు సిబ్బంది ప్రత్యేక నిఘా పెట్టారు. బైక్ దొంగతనానికి సంబంధించి వచ్చిన ఖచ్చితమైన సమాచారంతో నాగమంగళం వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ‘బజాజ్ సీటి 100’ బైక్‌పై అనుమానాస్పదంగా వస్తున్న వరదరాజును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో నిందితుడు నిజాలు ఒప్పేసుకున్నాడు. తాను ప్రస్తుతం నడుపుతున్న బైక్‌తో పాటు మరో రెండు మోటార్ సైకిళ్లను కూడా చోరీ చేసినట్లు అంగీకరించాడు. దీంతో నిందితుడి నుంచి మొత్తం 3 బైక్‌లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్బంగా పోలీసులు పలు సూచనలు చేశారు.. ప్రజలు తమ ద్విచక్ర వాహనాలను సురక్షిత ప్రదేశాల్లో పార్క్ చేయడంతో పాటు తప్పనిసరిగా హ్యాండిల్ లాక్ మరియు అదనపు సెక్యూరిటీ లాక్లను ఉపయోగించాలని పోలీసులు సూచించారు. వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను భద్రంగా ఉంచుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాల గురించి సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు లేదా అత్యవసర సేవ 112కు సమాచారం అందించాలని కోరారు. సమాజంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై తీవ్ర కఠిన చర్యలు ఉంటాయి. నేరాల నివారణలో ప్రజలు పోలీసులకు సహకరించి, పరిసరాల్లో ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుల్స్ సుబ్రహ్మణ్యం, రామచంద్ర, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
