ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిశక్తిపీఠంలో వైభవంగా శ్వేత వారాహీ నవరాత్రి మహోత్సవాలు...

శక్తిపీఠంలో వైభవంగా శ్వేత వారాహీ నవరాత్రి మహోత్సవాలు…

📰 Generate e-Paper Clip

ఏడో రోజు విశేష పూజలు, రక్త పంచమి వారాహీ మంత్ర హోమం.. 25 వేల మందికి పైగా భక్తుల దర్శనం..

తిరుపతి: ప్రపంచంలోని అత్యంత మహిమాన్వితమైన ఏకైక శ్రీ పాతాళ శ్వేత వారాహీ మహాక్షేత్రం అయిన రామచంద్రపురం మండలం రాయలచెరువు కట్టపై వెలసిన శ్రీ శక్తిపీఠంలో జరుగుతున్న శ్రీ శ్వేత వారాహీ నవరాత్రి మహోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వైభవంతో కొనసాగుతున్నాయి. మహోత్సవాల ఏడవ రోజున శ్రీ వారాహీ అమ్మవారికి పంచామృతాభిషేకం, విశేష అర్చనలు, మహా మంగళహారతి వైదిక మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సత్సంతాన ప్రాప్తి, నవగ్రహ దోష నివారణ, సర్వకార్యసిద్ధి, భూ–గృహ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం విశేష ఫలప్రదమైన శ్రీ రక్త పంచమి వారాహీ దేవి ప్రత్యేక మంత్ర హోమం నిర్వహించారు. అనంతరం సువాసినీ స్త్రీలకు సంప్రదాయబద్ధంగా సువాసినీ పూజ నిర్వహించగా, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. శక్తిపీఠాధిశ్వరి శ్రీ రమ్యానంద భారతి స్వామిని స్వయంగా అమ్మవారికి దివ్య అలంకరణ నిర్వహించి, మధ్యాహ్నం మహా హారతి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామిని మాట్లాడుతూ, శ్రీ శ్వేత వారాహీ దేవి మహిమ, నవరాత్రి ఉత్సవాల ఆధ్యాత్మిక ప్రాశస్త్యం, వారాహీ ఉపాసన వల్ల కలిగే దైవానుగ్రహం గురించి భక్తులకు వివరించారు. సాయంత్రం కళా నివేదన కార్యక్రమంలో సంగీత, నృత్య, సాహిత్య సేవలను అమ్మవారికి సమర్పించి భక్తిరసాన్ని పంచారు. రాత్రి పరమపూజ్య శ్రీ మాతాజీ వారి సన్నిధిలో నవరాత్రి పూజ, దర్బారు సేవ భక్తి పారవశ్యంతో జరిగింది. అనంతరం నడిచే దైవం జగద్గురువుల చేతుల మీదుగా మహా హారతి నిర్వహించి, అమ్మవారికి ఏకాంత సేవతో ఆ రోజు ఉత్సవాలు ముగిశాయి.ఈ పవిత్ర సందర్భంగా సుమారు 25 వేల మందికి పైగా భక్తులు శ్రీ శక్తిపీఠాన్ని సందర్శించి అమ్మవారి దివ్య దర్శన భాగ్యాన్ని పొందారు. విచ్చేసిన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ సమృద్ధిగా నిర్వహించడం పీఠం సేవాతత్పరతకు, గురు–దైవానుగ్రహానికి ప్రతీకగా నిలిచింది.శ్రీ శ్వేత వారాహీ నవరాత్రి మహోత్సవాలు ప్రతిరోజూ వైదిక సంప్రదాయాల ప్రకారం విశేష పూజలు, హోమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కొనసాగుతున్నాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలను పొందాలని శక్తిపీఠం నిర్వాహకులు ఆహ్వానించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!