*తీసుకుంటున్న జీతానికైనా న్యాయం చేయాలి కదా*
*ఒక్క బస్తా యూరియా కోసం మూడు రోజులు పడిగాపులా*
*అధికారుల నిర్లక్ష్యంతోనే రైతులకు ఇక్కట్లు*
*ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా పని చేస్తే సహించేది లేదు*
*కల్లాడు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే*
*రైతుల ఇక్కట్లు విని సచివాలయ సిబ్బందిపై మండిపాటు*
పలమనేరు, జులై 25 ( గరుడ ధాత్రి ) :
గతంలో ఇద్దరు చేసిన పనిని ఇప్పుడు 20 మంది ఉండి చేయలేకపోతున్నారా అంటూ పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పలమనేరు నియోజకవర్గంలోని కల్లాడు సచివాలయాన్ని ఎమ్మెల్యే ఎన్. అమరనాథ్ రెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా పంపిణీలో సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తీవ్ర జాప్యం జరుగుతోందని, ఒక్క బస్తా యూరియా కోసం రైతులు మూడు రోజులుగా పడిగాపులు పడుతున్నారని అక్కడి రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
ఒక్క యూరియా బస్తా కోసం మూడు రోజుల పాటు రైతులు వేచి ఉండడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ అగ్రికల్చర్ అధికారిణి రేష్మా తో పాటు సిబ్బందిని రైతుల సమక్షంలో విచారించగా పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో ఎమ్మెల్యే ఆగ్రహానికి గురయ్యారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే మండల స్థాయి అధికారులను సచివాలయానికి పిలిపించారు. ఈ సందర్భంగా సచివాలయంలోని అసిస్టెంట్ ఏవోతో పాటు వెల్ఫేర్ అసిస్టెంట్ వినోద్ కుమార్, డిజిటల్ అసిస్టెంట్ జ్యోతిష్ కుమార్ లు సమయపాలన పాటించకపోవడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తునట్లు గుర్తించారు. దీంతో ఆయన మాట్లాడుతూ….”ఇద్దరు చేసే పనిని ఇరవై మంది కలిసి కూడా చేయలేకపోతున్నారా? తీసుకుంటున్న జీతానికైనా న్యాయం చేయాలి కదా” అంటూ సచివాలయ సిబ్బందిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల రైతులు తమ సొంత పనులు వదులుకొని ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి ఒకరిద్దరు సిబ్బంది తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తే సహించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా పంపిణీని వెంటనే సక్రమంగా నిర్వహించాలని ఎంపిడివో వినోద, ఏవో సంధ్యాలను ఆయన ఆదేశించారు. రైతులకు ఏదేని ఇబ్బందులు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్నతో పాటు పలువురు నాయకులు ఉన్నారు…
